స్వచ్ఛ మేడారానికి అందరం సహకరిద్దాం...

​ప్రపంచ పర్యావరణ సంస్థను అభినందించిన ప్రజా ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి
​గత 14 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, స్వచ్ఛభారత్ నిర్మాణమే ఏకైక లక్ష్యంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 'ప్రపంచ పర్యావరణ సంస్థ' (World Environment Organization) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల పండుగైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర-2026 (జనవరి 28 నుండి 31 వరకు)ను జాతీయస్థాయిలో గుర్తించేలా, ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం 22 భారతీయ భాషలలో రూపొందించిన 'స్వచ్ఛ మేడారం' పోస్టర్లను, క్లాత్ బ్యానర్లను ప్రజా ఐఏఎస్ అధికారి శ్రీ పరికిపండ్ల నరహరి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
​ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సిహెచ్. భద్ర, ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి కోనేటి, కోశాధికారి ఎండి. రెజ్వన్, స్కూల్స్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ ఏ. జోత్స్నారావు, జాతీయ కార్యదర్శి సిహెచ్. సాగర్, జాతీయ యువజన కార్యదర్శి సుమెర్ తదితరులు పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా శ్రీ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ...
"పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ పర్యావరణ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో ఏ సంస్థ, ఏ వ్యక్తీ చేయలేని విధంగా గత 14 ఏళ్లుగా వీరు చేస్తున్న పర్యావరణ ఉద్యమం గొప్పది. దీనికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. నేను ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రజా మద్దతుతోనే 'స్వచ్ఛ ఇండోర్' నగరానికి రూపకల్పన చేశాను. వరుసగా ఎనిమిది సార్లు దేశంలోనే అత్యుత్తమ స్వచ్ఛ నగరంగా ఇండోర్ నిలవడం, అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందడం మనందరికీ గర్వకారణం. ఆ స్ఫూర్తితోనే నేడు ప్రపంచ పర్యావరణ సంస్థ పనిచేస్తుండడం సంతోషకరం. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే మన మేడారం మహా జాతరను ప్లాస్టిక్ రహితంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక బాధ్యతతో ఈ ప్రయత్నానికి సహకరించాలి" అని పిలుపునిచ్చారు.
​కలయిక ఫౌండేషన్ చైర్మన్ చీరాల నారాయణ మాట్లాడుతూ...
"ప్రస్తుతం ప్రపంచ మానవాళి ముందున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం. దీనిని నివారించేందుకు ప్రపంచ పర్యావరణ సంస్థ, స్వచ్ఛ ఇండోర్ రూపశిల్పి పరికిపండ్ల నరహరి గారి స్ఫూర్తితో పనిచేయడం అభినందనీయం. స్వచ్ఛ మేడారం లక్ష్యంగా జరుగుతున్న ఈ మంచి కార్యక్రమంలో మనందరం భాగస్వాములవుదాం" అని విజ్ఞప్తి చేశారు.
​ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్. భద్ర మాట్లాడుతూ...
"మా సంస్థ 'ప్రకృతి ఉపాధ్యాయుడు - ప్రకృతి మా భవిష్యత్తు' అనే నినాదంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 2000కు పైగా పాఠశాలల్లో రోజుకు లక్షలాది మంది విద్యార్థులను పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతోంది. గత 14 ఏళ్లుగా మేడారం జాతరలో దాతలు, పర్యావరణవేత్తల సహకారంతో 'సేవ్ మేడారం - క్లీన్ మేడారం' పేరుతో లక్షలాది జ్యూట్ బ్యాగులను పంపిణీ చేస్తున్నాం. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం. మా కృషిని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు ప్రత్యేకంగా అభినందించడం మాకు మరింత బలాన్నిచ్చింది. ఈసారి దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం 22 భాషల్లో అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాం" అని తెలిపారు.
​ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి కోనేటి మాట్లాడుతూ...
విద్యార్థులు, యువత, మహిళలే కేంద్రంగా బడిని-గుడిని అనుసంధానిస్తూ ప్రపంచ పర్యావరణ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.
​సంస్థ జాతీయ యువజన కార్యదర్శి సుమెర్ మాట్లాడుతూ...
"గత నాలుగు నెలలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ర్యాలీలు నిర్వహించి, వేలాదిమంది విద్యార్థులతో మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడబోమని ప్రతిజ్ఞ చేయించాం. జాతర సమయంలోనూ భారీ ప్రదర్శనలు నిర్వహించి, భక్తులను చైతన్యవంతులను చేస్తాం. మేడారంలోని జీవవైవిధ్యాన్ని, వనదేవతల సహజ అందాన్ని కాపాడడమే మా లక్ష్యం" అని పేర్కొన్నారు.

Related Articles